Thursday, November 20, 2008

స్వగతాలు


హక్కులు:
ఆశ -
ఆత్మ విశ్వాసానికున్న హక్కు.
దురాశ - ఆత్మవంచనకున్న హక్కు.
నిరాశ - ఆత్మపరిశోధనకు కావలసిన హక్కు.

కన్నీళ్ళు:
శ్రేయోభిలాషి బాధకు కొలత,
- ఎగసిన కెరటాలు.
స్వార్ధపరుడి బాధకు కొలత,
- తడిసిన తామరాకులు.

భ్రమలు:
అందం - అద్దంలో కనిపించనిది.
ఐశ్వర్యం - నవ్వడం తెలిసినవాడికి కనిపించనిది.
రాజకీయం - నిజాలకు కనిపించనిది.
కులం, మతం - నిజానికి అసలే లేనిది.

లెక్కలు:
జీవితంలోంచి కష్టాలను తీసేస్తే మధుమేహం.
జీవితలోంచి సుఖాలను తీసేస్తే అంగవైకల్యం.
కష్టాలను సుఖాలను కలపగా వచ్చిన జీవితం - ఆరోగ్యం.

ఏలికలు:
అదృష్టం - కాళ్ళు పట్టానా అని అడిగే భార్య.
దురదృష్టం - కాళ్ళు పట్టమని మాత్రమే అడిగే భర్త.

భూమికలు:
ప్రేమలు పెళ్ళిళ్ళ కోసం జరిగితే రీతులు అంటారు.
పెళ్ళిళ్ళు ప్రేమ కోసం జరిగితే రివాజులు అంటారు.
ప్రేమపెళ్లిళ్ళ కోసం భాద్యతలు ఆగితే విపరీతాలంటారు.

భ్రమణాలు:
జననం, జీవనం, మరణం - ఈ లెక్కలో ఏది తప్పు?
జీవితాలకి కారణం జననాలు.
మరణాలకి కారణం ఆ జీవితాలు కాదు, మరిన్ని జన్మలు.

పరమసత్యాలు:
దేవుడు ఎవ్వడు?
- అమ్మ ఉన్న ప్రతివాడు.
మరి మనిషి ఎవ్వడు?
- దేవిడీ కన్నా అమ్మని ప్రేమించేవాడు.

నిజానిజాలు:
నీ జీవితంలో నిజాలు ఎన్ని?
- గుప్పెడు ఇసుకలో రేణువులెన్నో చెప్పడం కష్టం!
నీ జీవితంలో అబద్ధాలు ఎన్ని?
- కోడిగుడ్డు మీద ఈకలెన్నో చెప్పడం కష్టం!

ప్రమాణాలు:
నేను వేసే ఒట్టు, నీలో అనుమానానికి పర్యాయపదం.
నీకున్న అనుమానం, నాకు జరిగే అవమానానికి నిదర్శనం.
నీకు అనుమానం, నాకు అవమానం, రెండూ మంచివి కావు.

1 comment:

Anonymous said...

దురాశ - ఆత్మవంచనకున్న హక్కు!!!
I am amazed... You must have really thought of it a lot.