Tuesday, June 10, 2008

కమనీయం

ఆమె: వచ్చావూ! మోత్తానికి మళ్ళీ ఆలస్యమయ్యవూ? నిన్ను ఎవ్వరూ మార్చలేరు.
అతడు: ఏమిటా నిష్టూరలు?
ఆమె: నీకు అలా అనిపించాయా? నావి తిట్లు అని నేనే చెప్పుకోవాల్సి వస్తోంది చివరికి, ఖర్మ!
అతడు: ఎందుకో తిట్లు, ఏం తప్పు చేసానని ఇప్పుడు నీ గోలా నువ్వునూ?
ఆమె: మొదటిసారి చేసినవాడికి ఏం తప్పో చెప్పాలి. నీలాంటి వాడికి ఎన్నోసారో చెప్తే చాలు. సరేగాని, ఇవ్వాళ ఏం కథ చెప్పబోతున్నావు?
అతడు: నేను కథలు చెప్పడమేమిటే?
ఆమె: అదేలే, నీ భాషలో కారణం! ఏమిటా అని?
అతడు: కారణం లేకుండా తప్పు చేసేవాడిలా కనిపిస్తున్నానా నీ కంటికి?
ఆమె: తప్పుల కోసం కారణాలు తయారుచేసేవాడిలా కనిపిస్తున్నావు!
అతడు: నువ్వు నాకు అంకాలమ్మలా కనిపిస్తున్నావు! అయినా, వినే ఓపిక నీకుంటే చెప్పాల్సిన కారణం నాదగ్గరుంటుంది. ఇందాకట్నుంచీ చూస్తున్నాను, అసలేంటే నీ సంగతి? మగాడు అన్నాక దార్లో బోల్డన్ని అడ్డంకులూ, భాద్యతలూ, తెలినవాళ్ళు, తెలియనివాళ్ళు, అవీ, ఇవీ ఉంటాయి మరి. కాస్త ఆలస్యమైతే ఏదో నేరం చేసినట్టు నీ దబాయింపూ నువ్వూనూ......
ఆమె: నాది దబాయింపైతే నీది బుకాయింపు.
అదంతా నాకనవసరం అబ్బాయ్! ఇహ నా వల్ల కాదు. వేసవి గాడ్పుల్లో ఎదురుచూపులు నా వల్ల కాదంటే కాదు! అందుకే నిర్ణయం తీస్కున్నాను.
అతడు: ఏమిటదీ? ఇంకోసారి ఎదురుచూడకూడదు అనా?
ఆమె: ఇంకొకళ్ళని చూస్కుని నిన్ను మర్చిపోకూడదా అని!
అతడు: ఒసిని! అదేంటే బాబు......! ధడేల్మనే నిర్ణయం చెప్పి గుండె గుభేల్మనిపించావు?
ఆమె: మరి లేకపోతే ఏంటి నువ్వూ?
ఎన్నాళ్ళని ఓపిక పట్టమంటావు?
సగం రోజులు అసలు కనిపించవు.
అదేమంటే పనిమీద వేరే ఊరికేళ్ళాను అంటావు.
ఉన్నా మిగిలిన రోజుల్లో సగమేమో ఏవో అనివార్యాలు, నేనేం చెయ్యనూ అంటావు.
పైగా నీకు పెల్లైంది అనే కథలు వింటున్నాను అంటే, అవి కట్టుకథలు వాటిని నమ్మద్దంటావు.
ఇంకా చేసే ఉద్యోగం అమ్మాయిల మధ్యలో అని బెంగపడితే వాళ్లు నా కంటికి కనిపించనంత దూరం అంటావు.
చివరికి నా దురదృష్టం కాకపోతే నేనుండే జాగామొత్తం నాలాంటి అమ్మాయిలే అని గుర్తుచేస్తే, ఇహనేం నాతో వచ్చేయ్యీ అంటావు.
అందుకే చిన్న నిర్ణయం! ఇప్పుడు చెప్పు ఏమంటావు?
అతడు: ప్రాస చూసి మరీ తిడుతున్నావు కదే! ఇదిగో నా బుజ్జి కదూ.....
ఆమె: కాదు!
అతడు: నా తల్లి కదూ.....
ఆమె: చీ....కాదు!
అతడు: నా ప్రేయసి కదూ.....
ఆమె: ఇకనుంచి కాదు!
అతడు: ఒసేయ్, ఒసేయ్! అలా అనకే! చెప్పేది కాస్త వినవె!!
ఆమె: అబ్భా! సరే వింటున్నా! కానీ!
అతడు: అది కాదె. నిజంగా చెప్తున్నా. మీ ఇంటి దగ్గర్లోకి వచ్చి చాలాసేపయ్యిందే. తీరా వచ్చాక మధ్య దారిలో ఎవరెవరో స్నేహితులు, అవసరమైనవాళ్ళు, అవసరం లేనివాళ్ళు, వాళ్లు, వీళ్ళు, అబ్బబ్బబ్బబ్బ....అబ్బ....చీ....చీ....ఒహటే నస. మరీ మొహం చాటేయ్యలెం కదా. మొత్తానికి తప్పించుకోచ్చేసరికిఇదిగో ఇదీ పరిస్థితి. అదీ సంగతి!
ఆమె: హూం.......!(అని పేద్ద దీర్ఘం)
అతడు: నిజంగానే బాబు. నీమీదొట్టు. ఇంత నిజాయితీగా ఇన్ని నిజాలు చెప్తూంటే మూతి సాగదీసి మూలుగులేంటి చెప్పు, అన్యాయంగా!
ఆమె: ఏమైనా కొత్తగా చెప్తావనుకున్ననులే!
సరే సరే! నిన్ను చూస్తే జాలేస్తోంది. ఇక చాల్లే. ఇలారా! వచ్చి పక్కన కూర్చో!
అతడు: అలా అన్నవూ బాగుంది! నీ ప్రేమ నాకు తెలీదూ?
ఆహా! ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది!
ఆమె: ఓస్.........అంతేనా? (మళ్ళీ పేద్ద దీర్ఘం)
అతడు: ఓయ్....ప్రపంచాన్ని జయించడం అంటే అంత సులువా నీ దృష్టిలో?
ఆమె: ఆడదాని మనసు కన్నా చాలా సులువు!
అతడు: అది మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం.
ఆమె: మీ వెటకారాల కోసం కాదు మేమేదురుచూస్తూంది.
అతడు: అదిగో, మళ్ళీ కోపం!
ఆమె: మరి లేకపోతే ......నేను మాట్......
అతడు: సరేసరేసరే అమ్మా తల్లీ! తప్పయ్యింది! ఇంకేమీ అనను. అనను కాక అనను! సరేనా?
ఆమె: నువ్వు ఏం చెప్పినా లాభం లేదు. నిన్ను కడిగేద్దామని నిర్ణయించుకునే తిష్టేస్కుని కూర్చున్నాను రోజిక్కడ.
అతడు: అబ్బో......రోజూ ఏదో ముద్దు పెట్టడానికి వచ్చినట్టు! (కళ్లు మూసి, కనుబొమ్మలు పైకెత్తి)
ఆమె: ఏమిటీ గొణుగుతున్నావు?
అతడు: అదే అదే! ఇంత చిన్న నీకు అంత లావు కోపమోచ్చేపని ఏం చేశానా అని ఆలోచిస్తున్నాను, అంతే!
ఆమె: ఆలోచించాలంటే మెదడు కావాలేమో పాపం! (కళ్లు మూసి, కనుబొమ్మలు పైకెత్తి, మళ్ళీ మూతి సాగదీసి)
అతడు: అందుకే నువ్వోద్దులే. నేను ఆలోచిస్తాను.
ఆమె: చీ....నీకు సిగ్గు లేదు!
అతడు: నీకు నా మీద నమ్మకం లేదు!
ఆమె: నువ్వు చేసే పనులనుబట్టే!
అతడు: ఇంకా ఏం చేసానే పిచ్చి మొహమా? (లేవగానే ఎవరి మొహం చూసానో ఏంటో...ప్చ్?)
ఆమె: నిన్న ఏదో చాలాఆఆఆ .......ముఖ్యమైన పనుందని చెప్పి త్వర త్వరగా వెళ్ళిపోయావు. తీరా చూస్తే, పోతూ పోతూ సందు చివర ఆగావు......ఏంటి నాయనా......ఏంటీ సంగతీ? (కళ్లు ఎగరేస్తూ)
అతడు: మీ సందు చివర ఏం జరిగిందో నాకెలా తెలుస్తుందీ? నువ్వే చెప్పాలి.
ఆమె: ఛా:! చూస్తున్నా చూస్తున్నా! చూస్తూనే ఉన్నా!
ఆవిడగారెవరితోనో ఇక ఇకలూ, పక పకలూ, వంకర్లూ, టింకర్లూ......ఏమిటీ సంగతీ? ఎవరావిడా, నీకేమౌతుంది, నువ్వు దానికేమౌతావు?
అతడు: ఆవిడా....? ఎవరబ్బా?
ఒహ్...ఆవిడా?
ఆమె: ఊం .....ఆవిడే! ఎవరూ అని? నువ్వు దానికి నచ్చావా, అది నీకు నచ్చిందా అని?
అతడు: పాపం, పాపం, మహాపాపమే. ఆవిడ వయసులో బుద్ధిలో నా కన్నాచాలా పెద్దావిడ. దూరం నుంచి చూసి అమ్మాయిలా కనిపించింది నీకు. నా చిన్నప్పటినుంచీ ఆవిడ గురించి మా హితులూ స్నేహితులు మహా గొప్పగా చెప్పేవాళ్ళు. తీరా పెద్దయ్యాక రాకపోకలు పెరిగాయి. ఆవిడంటే నాకు ఎంతో గౌరవం. ఆవిడ పేరు అరుంధతి. మహా పతివ్రత పేరుని పట్టుకుని నోటికొచ్చినట్టు వాగితే కళ్లు ధమాల్మని ఫేలిపొతాయి. తెలిసిందా?
ఆమె: నువ్వు చెప్పేదంతా నిజమేనా?

[ఇంతలో వీళ్ళు కూర్చున్న తోట మీదుగా నారద మునీంద్రుల వారు నారాయణ మంత్ర గానం చేస్కుంటూ వెళ్తూ కనిపించారు.]

అతడు: నీకు దేవుడు బుర్రని మర్చిపోయి అనుమానాన్ని మాత్రం శరీరమంతా సరిపడ ఇచ్చాడు. ఇంత చెప్పినా నమ్మకపోతే నేనేమీ చెయ్య......
అదిగో నారదులవారు, ఆయనకీ తెలియంది లేదు. ఆయన్నే అడుగుదాం పద.
ఆమె: సరే పద.
అతడు; లే మరీ!

నారద: నారాయణ హరి నమో నమో! నారాయణ హరి నమో నమో!

అతడు: స్వామీ స్వామీ, నారద మునీంద్రా! కాస్త ఆగండి స్వామీ!
నారద: నారాయణ, నారాయణ! ఎవరూ, నువ్వటయ్యా! ఏమిటి నాయనా సఖీ సమేతంగా నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏం జారిందినాయనా?
అతడు: అంతా ప్రారబ్ధం స్వామీ!
ఏం చెప్పమంటారు? సఖీ అని నేను పిలవడం, మీ లాగ లోకమంతా అనుకోవడం తప్ప, సఖుడిని అనే గౌరవం ఈమెలో ఆవగింజంతైనా లేదు స్వామీ. పైగా పీకలోతు అనుమానం నా మీద.
నారద: అందమైన ప్రియుడున్న అందాల రాశికి అభద్రతా భావం అతిసహజం కదా నాయనా? (వంకరగా నవ్వుతూ)
అతడు: నవ్వండి స్వామీ నవ్వండి! నా పరిస్థితి అందరికీ అర్ధమౌతుంది మీకు తప్ప. ఎందుకంటే మీరు నా పరిస్థితుల్లో ఎప్పుడూ లేరూ ఇకపై ఉండరుగదా, అదీ మీ ధైర్యం!
నారద: నారాయణ నారాయణ (చెవులు మూస్కుని కంగారుగా)! అటు తిప్పీ ఇటు తిప్పీ చివరికి నా మీదకే వచ్చావూ? బాగు బాగు! బావుందయ్యా నీ బేరం!
అతడు: అది కాదు స్వామీ, మీరే చెప్పండి. మీకు అరుంధతి గారు తెలుసు కదా?
నారద: ఆమె తెలియందేవరికి నాయనా, బాగా తెలుసు, మహా సాధ్వి!
అతడు: అల్లా పెట్టండి గడ్డి! దూరం నుంచీ ఆమెతో నన్ను చూసి ఇందాకట్నుంచీ ఒకటే గోల. ఎలా నమ్మించాలో తెలియక చస్తూంటే సమయానికి మీరోచ్చారు.
నారద: అదా సంగతీ! తప్పమ్మా తప్పు! అరుంధతి పుణ్యాత్మురాలు ! ఇతగాడిపై అనుమానం ఉండచ్చునేమో గాని ఆమెపైన మాత్రం కాదు. మహా తప్పుకదూ! లెంపలు వేసుకోవమ్మా!
అతడు: స్వామీ..........!
ఆమె: క్షమించండి స్వామీ! ఇకపై ఆడవారిని అనుమానించి అవమానించను. కాని ఈయన మీద మాత్రం నమ్మకం కుదరనేకుదరదు నాకు, అదేమిటో స్వామీ!
అతడు: స్వామీ...................!
నారద: అబ్బా, అంత బిగ్గరగా అరవకు నాయనా.
అతడు: అంతేలెండి స్వామీ, అబల శోకం చూడగానే నా ఆర్తనాదం కుడా అరుపయ్యింది మీ చెవులకు!
నారద: ఆగవయ్య మగడా! మీ ఇద్దరి సమస్యకీ పరిష్కారం ఆలోచించనీవయ్యా కాస్త!
ఆమె: ఒక్కటే పరిష్కారం స్వామీ, ఏముందీ, పెళ్లి !
నారద: దివ్యాలోచనాకదూ, ఏమయ్యా నీకేమైనా అభ్యంతరమా?
అతడు: అభ్యంతరమేముంటుంది స్వామీ? అనుమానాల గోల ఆగితే చాలు అదే పదివేలు!
నారద: అలా కోపగించకు నాయనా!
కన్నులపండువగా శోభాయమానముగా సంవత్సరంలో కెల్లా సుదినాన్ని వెదకి అరు
తేజోమయ విరాజిల్లితమైన ఆకాసమంత పందిరివేసి, అఖిల చరాచరానికి ఆధారమైన భూగోమంత మండపమేసి, అనంత జీవకోటికీ మదర్పిత చందన తాంబూలాది సత్కారముల్గైకోన మధురాహ్వానమిచ్చి, పంచభూతములూ ముక్కోటి దేవతల సాక్షిగా కల్యాణం చేసుకోండి, అనుమానపు నీడల్ని కమనీయ వివాహ బందపు వేలుతుర్లు చెదరగొట్టి వేస్తాయి, దాంతో మీ జీవనం సుఖాంతమౌతుంది.
అతడు: (కింది పదవి కింద చూపుడు వేలు, గడ్డం కింద మిగిలిన వేళ్ళూ పెట్టి ఆకాసంవైపు చూస్తూ) స్వామీ, మీరు చెప్పిందంతా విన్నాక ఒక్కటి మాత్రం అర్ధమయ్యింది స్వామి. వివాహ బంధం వల్ల జరిగే మంచి సంగతెలా ఉన్నా, ఖర్చు మాత్రం చాలా అవుతుందీ అని!
ఆమె: అదిగో అదిగో చూసారా స్వామీ, పెళ్లి ఉద్దేశం పిసరంతైనా లేదు ఆయనకీ?
నారద: ఉండవమ్మా ఉండూ!
అలా తీసిపారేయ్యకు నాయనా! స్త్రీలోల తత్వం నీ నడతలో లేకున్నా నీ మొహములో మాత్రం విస్తరించి మరీ కనిపిస్తుంది మరీ! మెరిసిపోయే నిన్ను వీక్షించి ఆడ చీమైనా మోహించి లాలించి నిన్ను అమాంతం ప్రేమించిపడేస్తుందేమో అని అమ్మాయి భయం, అర్ధం చేస్కోవాలి మరి. నీకు ఇది తప్ప వేరే మార్గం లేదు మరీ!
అతడు: సరే స్వామీ, మీరు చెప్పాక కాదనేదేముంది, మాటు మీ మాటే నా కర్తవ్యము!
నారద: శుభస్య శీఘ్రం! శీఘ్రమేవ కల్యామస్తూ! ఇష్టసఖి ప్రాప్తిరస్తూ! ఐశ్వర్యారోగ్యాభివ్రుద్దిరస్తూ! సఖలవాంచాఫల సిద్దిరస్తూ!
అవునూ, ఇంతకీ మీ పెద్దవాళ్ళ సంగాతేమిర్రా పిల్లలూ?
అతడు: అది మాత్రమడకకండి స్వామీ! నా వాళ్ళేమో ప్రపంచోద్ధరణోద్యమాలూ అనునిత్యం సంఘసేవలూ అంటూ ములిగిపోయారు. తనవాల్లేమో నిన్నో మొన్నో పెల్లైనవాళ్ళ మల్లే నీరసంలేని సరసవిరస క్రీడల్లో ములిగిపోయారు. ఇక మాకు మేమూ, ఒకరికి ఒకరం అంతే! తప్పదు.
నారద: వాళ్ళందరి సంగతీ నాకు తెలిసే అడిగానులే!
అతడు: తెలిసినవే అడుగుతారని మీ సంగతీ నాకు తెలిసే చెప్పనులేండీ నేను కుడా!
నారద: బ్రతక నేర్చినవాదివయ్యా నువ్వు! సరేసరే. పెల్లిపెద్ద కావాలంటే నేనున్ననుగా! నేను ఏది చేసినా లోకకల్యాణార్ధమేగా! ఇంతకీ పెళ్ళి చేస్కుంటారు సరే, కాపురం ఎక్కడ పెడతారు అని? కన్యాదానమా లేక ఇల్లరికమా? రెండూగాక విడికాపురమా?
అతడు: స్వామీ....................!
నారద: ఏమీ.....................! మళ్ళీ ఏమిటి నాయనా?
అతడు: సర్వజ్ఞానులు మీరు. అన్నీ తెలిసి మీరే ఇలా ఇరుకులో పెట్టడం భావ్యమా స్వామీ? నా పరిస్థితి తెలిసి కుడా మీరిలా.......
నారద: నీ సందేహం సవిదితమే నాయనా, భయపడకు. సంసారానికి సరైన చోటు నేను చూపిస్తా కదా!
అతడు, ఆమె: ఏమిటి స్వామీ అదీ?
నారద: అమ్మయికేమో నీరు బాగా ఉన్నచోటు తప్ప పడదు. నీకేమో ఊళ్ళు తిరిగే ఉద్యోగం వదిలే అవకాసం జన్మకు లేదు. అందుకే నీ ఇంటి వెనకాలే కదయ్యా గంగా నది ఉన్నదీ. తీసుకెళ్ళి ఒడ్డున పెట్టు సంసారాన్ని.
అతడు: ఆహా! అద్భుతమైన దారి చూపించారు స్వామి. మాకు మీకన్నా ఆప్తులింకేవ్వరు స్వామీ. మేము సిద్ధం, మీ చేతుల మీదుగా జరగాల్సినవాటి గురించి మీరు ఆలోచించడం తప్ప!
నారద: తధాస్తూ!

[అదండీ సంగతీ! రకంగా చంద్రుడికీ కలువకూ కళ్యాణం చేయించాడు లోకకల్యాణాల నారదుడు. అనుమానాలన్నీ తొలగిపోయాయి కలువకి. ఎందుకంటేఇక చంద్రుడు ఇరవైనాలుగు గంటలూ తనతో బాటే కాబట్టీ . బుద్ధిగా ఇంటిపట్టున ఉంటూ తన ఉద్యోగం తను చేస్తూ మరో చోటుకి వెళ్లవలసిన ప్రతీసారి తనతోపాటు భార్యను వెంటపెట్టుకుని వెళ్తూ సుఖిన్స్తున్నాడు చంద్రుడు. ఇదివరకు తను చెప్పిన మేఘాలు వర్షాలు లాంటి అడ్డంకుల కారణాల అవసరం ఇక ఏనాటికీరాదు కదా. శివుని శిరస్సు పైన గంగా కలువకు అంతః పురమైతే, శిరస్సు ఇరువురికీ సొంతిల్లు అయ్యింది. ఇలా వీరిద్దరి కథా సుఖాంతమయ్యింది . నారాయణ, నారాయణ!]